సీట్ల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికారపక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభ సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ అయిన తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. ఇదే అంశంపై అంబటి రాంబాబు స్పందిస్తూ చంద్రబాబు సింపతీ డ్రామాలు ఆడుతున్నారని, ప్రజల్లో సానుభూతి కోసం డ్రామాలని ఎద్దేవా చేశారు.. చర్చకు అడగటంలో తప్పులేదని అంతేకాని బెదిరిస్తే బెదిరిపోయే వారు ఇక్కడ ఎవరు లేరని అంబటి చంద్రబాబును హెచ్చరించారు.
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ సీట్ల కేటాయింపు సభ నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు. తమ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి మొదటి నుంచి కూడా ఒకేసీటులో కూర్చొంటున్నారని చంద్రబాబు పక్కనే కూర్చోవాలని అతను ఆశపడుతున్నాడని జగన్ సెటైర్లు వేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయినా.. మొదటి సారి ఎమ్మెల్యే అయినా ఒకటే రూల్స్ బుక్ ఫాలో అవ్వాలన్నారు.