కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది.
తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అటు అసమ్మతి ఎమ్మెల్యేలు… తనకు మరింత సమయం కావాలంటూ ఇటు స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
ఈ కేసు రాజ్యాంగంలోని 190, 361 అధికరణలతో ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే ముందు వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చా అన్నది నిర్ణయించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈ కేసును మంగళవారానికి వాయిదా వేస్తూ… అప్పటి వరకు యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది