తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ కార్యకర్త రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో అర్ధమవుతుంది. “అన్నా.. చంద్రన్నా.. నీవు ఎప్పుడూ టీడీపీ మీటింగుల్లో చెబుతూ ఉంటావు.. కార్యకర్తలకు అండగా ఉంటానని.. అధికారంలో ఉన్నన్నాళ్లూ మేం ఎంతోఆశగా పార్టీ జెండాలు మోశాం.. అప్పటి మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న పాపానపోలేదు. వారికి అధికారంలో ఉన్నపుడు కార్యకర్తలు కనపడరు. కనీసం వారి పీఏలను కలవాలన్నా రికమెంటేషన్లుండాలి.. ఇక ఆయా నాయకులు మీచుట్టూ చేరి వాస్తవ పరిస్థితులు చెప్పకుండా పొగడ్తలతో ముంచేస్తారు. మీకుమాత్రం అప్పట్లో మిమ్మల్ని పొగిడేవారితో మాట్లాడ్డానికే సమయం సరిపోలేదు. ఇక మావైపు చూడ్డానికి మీకు తీరికెక్కడుంది.? మనపార్టీ అధికారం కోల్పోయిన తర్వాతే మాలాంటి వాళ్లం దేవుళ్లలా కనిపిస్తాం.. ఏం లాభం.. ఇప్పుడు మమ్మల్ని పరామర్శిస్తూ మీరు పర్యటనలు చేస్తున్నారు.. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీ జెండాలు మోసి.. మోసి చాలామందికి భుజాలు కాయలుకాశాయి.. కానీ అధికారంరాగానే మేమంతా కరివేపాకులమయ్యాం.. కొత్తగా వచ్చినవారిని అందలమెక్కించారు. వారుచెప్పిన మాటలే నమ్మి మీరు ముందుకెళ్లారు. అలా తగిన గుర్తింపు లేక మోసపోయిన వారిలో నేనూ ఒకడిని.. మాలాంటివారికి మీరు ఏమీ చేయలేదు. దయచేసి ఇప్పటికైనా మిగిలిన సిన్సియర్ కార్యకర్తలను, నాయకులను బలిచేయకుండా చూడండి.. అంటూ తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్త రాసిన లేఖ.. ఈలేఖ సారాంశాన్ని చూస్తే టీడీపీలోని సీనియర్లు, సిన్సియర్ కార్యకర్తలు, నాయకులు సొంత పార్టీ అధినాయకుల కారణంగా ఎంత మనోవేదనకు గురయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్నడూ లేనివిధంగా పార్టీ బలం పడిపోయింది. 175స్థానాలకు కేవలం 23 నియోజకవర్గాలకే పరిమితమైంది. అధికారంకోసం వేచిచూసిన వైసీపీ జగన్ ముఖ్యమంత్రి కాగానే సంబరాలు చేసుకుంది.. ఏ ఎన్నికల్లో అయినా ఎన్నికల ఫలితాలు వెలువడగానే అధికారంలోకి వచ్చిన పార్టీశ్రేణులు సంబరపడటం సహజం. కానీ ఓటమిపాలైన పార్టీ బాధితులకు అండదండలందించి మనోధైర్యాన్నివ్వడం అవసరం.. కానీ ఈ ఎన్నికల అనంతరం టీడీపీశ్రేణులు అండదండల విషయంలో తీవ్రంగా మనసు నొచ్చుకుంటున్నారట.. దాన్ని మనసులో దాచుకోలేని కొందరు కార్యకర్తలు ఇలా లేఖల రూపంలో బయటపెడుతున్నారు. కారణం చంద్రబాబు వారిని పరామర్శించకుండా అందరినీ జిల్లాలకు వెళ్లినపుడు కావచ్చు.. తాను ఇంటి దగ్గర ఉన్నపుడు కావచ్చు తననే తానే ఓదార్చేలా చేసుకుంటున్నారు తప్ప ప్రజలను తాను ఓదార్చకపోవడం కూడా ఈ విమర్శలకు తావిస్తోంది.
