చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని వైసీపీ అధినేత నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. రోజా కోసం జగన్ ప్రత్యేకంగా ఓ కొత్త పదవిని సృష్టించే పనిలో ఉన్నారట. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు అమలు బాధ్యతను రోజాకు అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసి దానికి రోజాను అధ్యక్షురాలిగా నియమించాలని అనుకుంటున్నారట. ఈ సంస్థ ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నవరత్నాల హామీల్ని దగ్గరుండి అమలు చేస్తుందన్నమాట. నిజంగా రోజాకు ఇది కీలకమైన బాధ్యత, పదవి. దాదాపు అన్ని శాఖల్ని సమన్వయపరిచే పదవి అంటే మామూలు విషయం కాదు. దీనికోసం సీఆర్డీఏ తరహాలో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని జగన్ భావిస్తున్నారు. దీనిపై ఏ మంత్రి ఆజమాయిషీ ఉండదు. పూర్తిగా రోజాదే బాధ్యత. ఆమె జగన్ కు రిపోర్ట్ చేస్తారన్నమాట. నవరత్నాల అమలుతో పాటు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా చూసే బాధ్యత కూడా రోజాదే.