మన దేశంలో యావత్తు బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది.
అర్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు.
ఎంపిక విధానం
ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే మూడు దశలు ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలను ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. వీటిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పునకు 1/4 మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలను గుర్తించడానికి గంట (60 నిమిషాలు) సమయం ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే తరవాతి దశలో ఉండే మెయిన్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 30
న్యూమరికల్ ఎబిలిటీ 35 35
రీజనింగ్ ఎబిలిటీ 35 35
మొత్తం 100 100
మెయిన్ ఎగ్జామినేషన్
ఇందులో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగు తారు. దీనిలో సబ్జెక్ట్ వారీగా సమయాన్ని నిర్దేశించారు. కాబట్టి ఆ సమయంలోపే ఆ విభాగాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించిన వారికి మాత్రమే తరవాతి దశలో ఉండే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 40 30 ని.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 40 30 ని.
న్యూమరికల్ ఎబిలిటీ 40 40 30 ని.
జనరల్ అవేర్నెస్ 40 40 25 ని.
కంప్యూటర్ నాలెడ్జ్ 40 40 20 ని.
మొత్తం 200 200 135 ని.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఖాళీలను అనుసరించి ఆయా బ్రాంచ్‌లు నెలకొని ఉన్న ప్రాంతాల్లోని స్థానిక/అధికారిక భాషలో పరిజ్ఞానం కలిగి ఉండాలి. లేకపోతే డిస్క్వాలిఫైయిడ్గా ప్రకటిస్తారు. చివరగా మెయిన్ ఎగ్జామ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను రూపొందించి పోస్టింగ్‌ను ఖరారు చేస్తారు.
సిలబస్
ఇంగ్లీష్ లాంగ్వేజ్: ఇందులో రీడింగ్ కాంప్రెహెన్షన్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వర్డ్ మీనింగ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ అవేర్నెస్: ఈ విభాగం నుంచి కరెంట్ ఆఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో టైమ్-డిస్టెన్స్, టైమ్-వర్క్, హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, ప్రొబబిలిటీ, పైప్స్, పెర్మూటేషన్స్ అండ్ కాంబినేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
కంప్యూటర్స్: ఈ విభాగం నుంచి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, బేసిక్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, బేసిక్ లాంగ్వేజెస్, డివైజెస్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
రీజనింగ్: ఇందులో బ్లడ్ రిలేషన్స్, అనాలజీ, సింబల్స్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడిండ్-డికోడింగ్, డైరెక్షన్స్, రో ఆరేంజ్మెంట్స్, స్టేట్మెంట్ రీడింగ్, అండర్ స్టాండింగ్, నెంబర్ సిరీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ప్రిపరేషన్
ప్రిలిమ్స్, మెయిన్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌లు కామన్‌గా ఉంటాయి. అయితే ప్రిలిమ్స్, మెయిన్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టతలో మార్పు ఉంటుంది. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు బేసిన్ కాన్సెప్ట్స్‌పై వస్తాయి. మెయిన్స్‌లో కొద్దిగా అడ్వాన్స్డ్ స్థాయిలో ఉంటాయి. మెయిన్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థులు అదనంగా కంప్యూ టర్స్, జనరల్ అవేర్నెస్ అంశాలను చదవాల్సి ఉంటుంది. అయితే మిగతా విభాగాల పోల్చితే వీటిని సులభంగా ప్రిపేర్ కావచ్చు. ఐబిపిఎస్ పరీక్షలు, ఎస్ఎస్సి, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఆయా పరీక్షల ప్రిపరేషన్ దీనికి సరిపోతుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన స్టాండర్డ్ బుక్స్, టెస్ట్ మెటీరియల్, మాక్/ మోడల్ టెస్ట్‌లు ఫాలో కావడం ప్రయోజనకరం. ఎందుకంటే ప్రస్తుతం ఏ నియామక పరీక్ష తీసుకున్న సిలబస్‌లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ అంశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ ఆయా అంశాల్లో ప్రశ్నలను ఏ విధంగా అడుగు తున్నారు అనే విషయంపై అవగాహన ఏర్పర్చుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి.
వేగంగా కచ్చితత్వంతో
ప్రిలిమ్స్‌లో 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకు, మెయిన్‌లో 135 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక ప్రశ్నకు అర నిమిషం సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి వేగంగా కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించే విధంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు ఏకైక మార్గం ప్రాక్టీస్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రిలిమినరీ పరీక్షకు 37 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వడం చేయాలి. ఈ క్రమంలో ఐబిపిఎస్, ఎస్ఎస్సి వివిధ పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాల సాధన కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మేథ్స్, లాజిక్‌తో సంబంధం ఉండే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రిపరేషన్ పరంగా సాధ్యమైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఎలిమినేషన్ స్కిల్‌ను అలవర్చుకోవాలి.
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఆర్బీఐ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. తెలుగు రాష్ర్టాల వారికి హైదరాబాద్‌లో ట్రైనింగ్ సెంటర్ ఉంది.
చిరునామా: 6-1-56, సెక్రటేరియెట్ రోడ్, సైఫాబాద్, హైదరాబాద్.
నోటిఫికేషన్ సమాచారం
ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలు: నవంబర్ 27, 28.
మెయిన్ రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2017
తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చీరాల.
వయసు: 20-28 ఏళ్లు (అక్టోబరు 1 నాటికి). రిజర్వ్డ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ. 450 (జనరల్/ఒబిసి), రూ.50 (ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడి/ఎక్స్ సర్వీస్‌మెన్)
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 10, 2017
Post Views: 294