జగన్ క్యాబినేట్ లో రాజకీయ వారసత్వం ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇది కచ్చితంగా నూతన అధ్యాయానికి నాంది పలకడమే. అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో కేవలం ఒకరితండ్రి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేశారు.
రవాణా, సమాచారశాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్నినాని (అసలు పేరు వెంకట రామయ్య ) తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఒకే శాఖకు మంత్రులవ్వడం విశేషం.
ఆళ్లనాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) సీనియర్.. 1994ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీచేశారు. ఉంగుటూరులోని బాదంపూడి లో ఉన్న “కాళీ బాబా” శిష్యులు అయినా ఆళ్ల నాని కుటుంబానికి వట్టి వసంత్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండేవి. 20-21 సంవత్సరాల వయస్సులోనే ఆళ్ల నాని 1992లో ఏలూరులో రాజీవ్ గాంధీ కంచు విగ్రహాన్ని విజయ్ విహార్ సెంటర్లో ఏర్పాటుచేసి దాని ఆవిష్కరణకు ముఖ్యఅతిధిగా వైఎస్సార్ ను తీసుకొచ్చారు.
అప్పటినుంచి నానికి వైఎస్సార్ తో అనుబంధం ఉంది. 1994 ఎన్నికల్లో మాగంటిబాబు తల్లి అప్పటి మంత్రి వరలక్ష్మి తన సిట్టింగ్ నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం నుంచి ఏలూరుకు మారారు. దీంతో కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు దాదాపు 10మంది రెబల్స్ గా నామినేషన్ వేశారు. బుజ్జగింపులు తరువాత ఒక్క ఆళ్ళనాని తప్ప మిగిలిన అందరూ బరిలో నుంచి తప్పుకున్నారు. ఆఎన్నికల్లో నానికి దాదాపు ఆరువేల ఓట్లు వొచ్చాయి,కాంగ్రెస్ తరుపున పోటీచేసిన మాగంటి వరలక్ష్మి ఓడిపోయారు. 1994 ఎన్నికల నాటికి 25 సంవత్సరాల యువకుడైన నాని ఏలూరు కాంగ్రెసులో దూసుకునిపోయారు. 1999లో టికెట్ తెచ్చుకున్నా ఓడిపోయారు. నాని పెళ్ళికి వైఎస్సార్ కుటుంబంతో సహా హాజరయ్యారు.
2004 ఎన్నికల్లో PCC అధ్యక్షుడిగా ఉన్న D.శ్రీనివాస్ ఏలూరు టికెట్ ను నానికి కాకుండా సూర్య పత్రిక యాజమాని సూర్య ప్రకాష్ రావ్ ఇచ్చారు. నాని తిరగపడటం, వైఎస్సార్ కలగచేసుకోవటంతో టికెట్ చివరికి నానికి దక్కింది. 2004,2009లో గెలిచిన నాని మొదటి నుంచి జగన్ తో నడిచారు. 2014 ఓడిపోయారు. తరువాత MLC దక్కటం, ఈ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు.
కొడాలి నాని.. (శ్రీ వెంకటేశ్వర రావ్) 2004లో టీడీపీ టికెట్ దక్కటమే పెద్ద సంచలనం.. జూనియర్ ఎన్టీఆర్ వలన టికెట్ వచ్చినా రావి శోభనాద్రి కుటుంబాన్ని దాటి నానికి టికెట్ రావటం కాంగ్రెస్ హవాలో కూడా ఆయన గెలవటం సంచలనమైంది.ఎన్టీఆర్ హిందుపురం స్థానాన్ని శాశ్వత స్థానంగా ఉంచుకొని సొంత నియోజకవర్గం గుడివాడను ఖాళీ చెయ్యటం వలన రావి శోభనాద్రి కుటుంబానికి 1985లో తొలిసారి MLA అయ్యే అవకాశం వొచ్చింది.
గుడివాడ నుండి 1985,1994లో TDP తరుపున రావి శోభనాద్రి చౌదరి గెలిచారు.1999లొ ఆయన కొడుకు హరిగోపాల్ పోటీచేసి గెలిచాడు కానీ ప్రమాణస్వీకారం చేయకముందే చనిపోయాడు. ఉప ఎన్నికలలో హరిగోపాల్ తమ్ముడు శివరామ క్రిష్ణను పోటీ చేయించాలనుకున్నారు.కాని అతను కూడ రైల్వే క్రాసింగ్ దగ్గర కార్ ను రైలు ఢీ కొనటంతో చనిపోయారు. శోభనాద్రివైరాగ్యంతో రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటే బాబుగారే అయన్ను వొప్పించి మిగిలిన చిన్న కొడుకు వెంకటేశ్వర రావ్ ను 2000 లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేయించి గెలిపించారు. రాజకీయ చరిత్ర, ఇద్దరు కొడుకులు చనిపోయిన సానుభూతిని దాటుకొని కొడాలి నాని 2004 లో టికెట్ సాధించి గెలిచారు. గుడివాడ చరిత్రలో హాట్రిక్ విజయాలు సాధించిన ఏకైక నాయకుడు కొడాలి నాని, 2004 నుంచి 2019 మొత్తం నాలుగు ఎన్నికల్లో గెలిచారు. రావి వెంకటేశ్వర రావ్ 2009లో ప్రజారాజ్యం,2014లో టీడీపీ తరుపున పోటీచేసినా నానిని ఓడించలేక పొయాడు.. 2014 తరువాత జగన్ ఆప్తులతో సహా 23 మంది వైసీపీ MLA లు టీడీపీలోకి ఫిరాయించినా, ఒత్తిడులు ఎన్నిఉన్నా ఓడిపోతే జగన్ డ్రైవర్ గానైనా పనిచేస్తాను కానీ టీడీపీలోకి ఫిరాయించనని విశ్వాసం చూపిన నానికి మంత్రిపదవి ద్వారా తగిన గుర్తింపు దక్కింది.
Source from siva racharla..