తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేని విధంగా ఏపీలో ఓటమి పాలవడం…తెలంగాణలో పోటీ చేయలేని స్థితికి చేరిపోవడం వంటి దారుణమైన అవమాన పరిస్థితులు ఓ వైపు కొనసాగుతుండగా….మరోవైపు ముఖ్యనేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏమాత్రం కనిపించని నేపథ్యంలో ఇలా సీనియర్లు అసంతృప్తితో ఉండటాన్ని భారతీయ జనతాపార్టీ క్యాష్ చేసుకుంటోంది. తెలంగాణలో ఇలా ఓ ముఖ్యనేతకు త్వరలో కాషాయ కండువా కప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అనూహ్య రీతిలో, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెల్చుకున్న ఊపులో ఉన్న ఆ పార్టీ…ఇతర పార్టీల్లోని ప్రముఖ లీడర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. ఇదే సమయంలో, తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. తెలంగాణలో నామమాత్రంగా మిగిలిన టీడీపీ నుంచి బలమైన లీడర్లపై కన్నేసింది. ఇటీవలే టీడీపీ నేత పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. టీడీపీలో ఒకప్పుడు నంబర్ టూగా ఉన్న దేవేందర్‌గౌడ్‌ను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు ముగ్గురు నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి డీకే అరుణ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డిలాంటి నేతల్ని చేర్చుకున్నట్టే.. మరికొందరిని తిప్పుకునే ప్రయత్నంలో ఉంది. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంలో భాగంగా ఆ పార్టీ అగ్ర నేతల సూచనలతో రాష్ట్ర లీడర్లు రంగంలోకి దిగారు. త్వరలో ఈ మేరకు కొందరు నేతలు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.