టీవీ9 మాజీ సిఈఒ రవిప్రకాశ్ నేడు సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలంద మీడియా సంస్థ ఏబీసీఎల్ లో 90 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈవిషయంలో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ సహకరించలేదని, ఫోర్జరీ చేశాడని కొత్త యాజమాన్యం తరపున కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా రవి ప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది.
ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి కీలకమైన డాక్కుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులు నమోదైనప్పటి నుండి రవిప్రకాష్ కన్పించకుండా పోగా హైకోర్టులో మూడు దఫాలు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేదు.. దీంతో సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సోమవారం నాడు రవిప్రకాష్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. అయినా విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రవిప్రకాష్ కు సూచించింది. దీంతో మంగళవారం ఎట్టకేలకు రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.