టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు మురళీ మోహన్‌ను పరామర్శించారు. అప్పట్లో ఆయన వీడియో చేసి అసలేం జరిగిందన్న విషయం వివరించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తాజాగా.. మురళీ మోహన్‌ను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని బాబు, లోకేష్ ఆకాంక్షించారు. అనంతరం మురళీ మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాగా.. ఆయన ఆపరేషన్ కుట్లు త్వరలోనే తీస్తారని.. రాజమండ్రికి వచ్చి అభిమానులు, అనుచరులు, నేతలను కలుస్తానని.. ఒకవేళ అలా కాని పక్షంలో ఒక్కొక్కరుగా తన ఇంటికి వచ్చి కలుసుకోవాలని మురళీ మోహన్ వీడియోలో చెప్పిన విషయం విదితమే.