ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేశారు.
అలాగే ఎల్లో మీడియాకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని టెండర్లూ పారదర్శకంగా ఉంటాయనీ, ఎల్లో మీడియా దురుద్దేశంపూర్వకంగా వార్తలు రాస్తే కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5ల పేర్లు ప్రస్తావించారు. దురుద్దేశంపూర్వకంగా వార్తలు రాస్తే కచ్చితంగా పరువునష్టం దావా వేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు కులం, మతం, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తామని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నానని జగన్ చెప్పారు. గతంలో తనమీద విషం కక్కినట్టు కొత్త ప్రభుత్వంపై విషం కక్కితే సహించబోనని జగన్ బాహాటంగా ఆగ్రహంగా చెప్పినట్టు అర్ధమవుతోంది.