ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ పేరు మారుమోగింది. ఆయన వెంట ఏపీ సీఎస్, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, నందిగాం సురేష్ ఉన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మోదీతో జగన్ చర్చించనున్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విభజన హామీలను నెరవేర్చాలని మోదీని డిమాండ్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న విషయం తెలిసిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలపనున్నారు.