మంగళగిరి నియోజకవర్గంనుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,769 ఓట్లతో గెలిచారు. ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, లోకేష్‌కు 99,314 ఓట్లొచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. అయితే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలిచ్చిన ఫలితం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసింది. కమ్మసామాజిక వర్గం ఎక్కువగా ఉండే మంగళగిరిలో టీడీపీని ఓడించడం, ఒక సామాన్య రైతు రెండోసారి గెలవడం పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు మొట్టమొదటసారి పోటీ చేస్తున్న మంగళగిరిలో గెలవడం మామూలు విషయం కాదు.. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ 350కోట్లు ఖర్చు పెట్టిందని వార్తలొచ్చాయి.
రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గం ఇదే.. మహిళలు అర్ధరాత్రి వరకూ క్యూలైన్లో నిలబడి లోకేశ్ వంటి రాజ్యాంగేతర శక్తి మాకు ఎమ్మెల్యే కాకూడదని పట్టుదలతో లైన్లలో నిలబడి వైసీపీకి ఓటు వేయడం కచ్చితంగా చర్చకు వచ్చిన అంశం. లోకేష్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోవడం, ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులు చేసిన భారీ అవినీతి వారి ఓటమికి కారణమైందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఆర్కే, రాజన్న క్యాంటీన్ నడుపుతూ కేవలం రూపాయికే భోజనం పెడుతున్నారు. మరింత మంచి కార్యక్రమాలు చేసి మళ్లీ మళ్లీ ఆర్కే గెలవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.