ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా గవర్నర్ స్పందించారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నగరంలోని ప్రగతి భవన్లో కలిశారు.తన సతీసమేతంగా ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్మోహాన్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్ఛాలిచ్చి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
జగన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని.. అనూహ్య విజయం సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందించారు.జగన్మోహన్రెడ్డితో కొద్దిసేపు రెండు రాష్ర్టాల సంబంధాలపై చర్చించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “ఇరుగు పొరుగు రాష్ర్టాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం తమ విధానమని తెలిపినట్లు” సమాచారం.. ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే పంథాను అవలంబిస్తామని ఆయన స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదీజలాలను సమర్థంగా ఉపయోగించుకుంటే రెండు రాష్ర్టాలు సుభిక్షంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోయే సీఎం జగన్ కు తెలిపారు.
రెండు రాష్ర్టాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం అని వైఎస్ జగన్‌తో సీఎం అన్నారు. గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం గరిష్ఠంగా 700 నుంచి 800 టీఎంసీలను మాత్రమే వాడుకునే అవకాశమున్నదని తెలిపారు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుందని, ప్రకాశం బరాజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించి, రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని, కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. త్వరలోనే రెండు రాష్ర్టాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు అని సమాచారం.