ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తొలినుంచి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పటి వరకు 18 స్టేలు రావడానికి కారణం ఆయనకు న్యాయవ్యవస్థపై ఉన్న పట్టేనని చాలా మంది చెబుతుంటారు. తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కూడా గతంలో ఉమ్మడి హైకోర్టులోని 15మంది న్యాయమూర్తులు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబుపై ప్రచురించిన కథనం సంచలనంగా మారింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మనం ఒక లుక్ వేద్దామా..” చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తూ కొంత మంది న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించకుండా అడ్డుపడేందుకు ప్రయత్నించిన విధానాన్ని బయటపెట్టింది.
అయితే న్యాయమూర్తులను నియమించే కొలిజియం చివరకు చంద్రబాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణల సిపార్సులను పక్కన పెట్టేసింది. చంద్రబాబు అభ్యంతరాలు, ఎన్ వి రమణ అభిప్రాయాలు ఒకేలా ఉండడాన్ని పత్రిక ప్రముఖంగా ఎత్తిచూపింది. . ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించే విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కోరగా…. ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మార్చి 21న లేఖ రాశారు. జస్టిస్ ఎన్వి రమణ అప్పటి సీజెఐ ఖేహర్ కు మార్చి 24న తన అభ్యంతరాలు తెలిపారు. ఇలా వెనువెంటనే చంద్రబాబు, ఎన్వి రమణ లేఖలు రాసిన తేదీలను పత్రిక ఎత్తిచూపింది. అలాగే కొద్ది తేడాలతో ఆ రెండు లేఖలు ఒకే విధంగా ఉండడాన్ని పాఠకుల ముందు పెట్టింది.
మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖలో జడ్జీలుగా సిఫారసు చేసిన ఆరుగురిలో ఐదుగురు జడ్జీలకు బంధువులు..లేదా జూనియర్లే ఉన్నారని అభ్యంతరం తెలిపారు. మార్చి 24న జస్టిస్ రమణ కూడా జడ్జీలుగా సిఫారసు చేసిన ఆరుగురిలో ఐదుగురు జడ్జీల కుటుంబ సభ్యులు లేదా జూనియర్లే అని అభ్యంతరం తెలిపారు. లేఖల్లోని కొద్ది పదాల్లో మాత్రమే తేడా ఉంది తప్పించి…చంద్రబాబు, ఎన్వి రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఓకేలా ఉన్నాయి. జడ్జీల నెంబర్లతో పాటు… కారణాలు కూడా ఏమీ మారలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలకు జస్టిస్ చలమేశ్వర్ గండి కొట్టినట్టు పత్రిక కథనం బట్టి తెలుస్తోంది. ఏ మాత్రం ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు చెల్లుబాటు కావని..ఇలాంటి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే కొలిజీయం వ్యవస్థ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ చలమేశ్వర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టు కూడా ఈ ఆరోపణలను నిర్దారించటం లేదని చలమేశ్వర్ ఎత్తి చూపారు. అన్నింటికి మించి చలమేశ్వర్ తాను చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖలో చంద్రబాబు, ఎన్ వి రమణ మధ్య సంబంధాలను కూడా ప్రస్తావించడం విశేషం. జస్టిస్ రమణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే అని చలమేశ్వర్ తన లేఖలో వెల్లడించినట్టు ఎనకామిక్ టైమ్స్ చెబుతోంది. ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా నియమించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలు..జస్టిస్ రమణ అభిప్రాయాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయని ఎత్తి చూపారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు సంచలన సృష్టిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని విమర్శలు వస్తున్న వేళ… ఇప్పుడు చంద్రబాబు కొందరు న్యాయమూర్తుల నియమాకాన్ని అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్వి రమణ అభిప్రాయాలు చంద్రబాబు అభ్యంతరాలు ఒకేలా ఉన్నాయని జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాసినట్టు బయటకు రావడంతో న్యాయవ్యవస్థపై చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం చర్చకు దారితీసింది” అని ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.