ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ పై చెప్పులు విసిరారు. బుధవారం రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీదకు ఓవ్యక్తి చెప్పు విసిరగా అది కమల్ కు తగలలేదు. ఇంకొందరు కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈదాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓహిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా కమల్ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా భారీగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగినట్టు స్పష్టమవుతోంది