టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్‌వోగా ఉన్న కేవీఎన్ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్ కొత్త డైరెక్టర్లు కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును నియమించినట్లు చెప్పారు. మహేంద్ర ప్రస్తుతం టీవీ9 కన్నడ ఛానల్ ను పర్యవేక్షిస్తున్నారు. సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా ఉన్నారు. టీవీ9 ను నిర్వహిస్తున్న సంస్థ అయిన ఏబీసీపీఎల్‌లో 90.54 శాతం వాటాను గత ఏడాది ఆగస్టులో అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
ఆ తర్వాత తమ తరఫున కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లను ఏబీసీపీఎల్‌లో డైరెక్టర్లుగా నియమించింది. కానీ ఈనియామకానికి రవిప్రకాశ్, మూర్తి అడ్డుతగిలినట్లు, కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద డీఐఆర్-12 దాఖలు చేయకుండా జాప్యం చేసినట్లు సాంబశివరావు వివరించారు. అంతేగాక అప్పటివరకూ ఉన్న కంపెనీ సెక్రెటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయనను తొలగించారని తెలిపారు. సంస్థలో 90 శాతం వాటా ఉన్న ‘అలంద’ ప్రతినిధులను యాజమాన్య స్థానాల్లోకి రాకుండా కావాలనే నిరోధించారని అన్నారు. రవిప్రకాశ్ ఇక ఎంతమాత్రం తమ సంస్థ ప్రతినిధి కారని, బ్యాంకులు, ఇతరసంస్థలు, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.
సంస్థలో ఆయనకు 8 శాతం వాటా ఉందని, ఆయన సాధారణ వాటాదారుడిగా కొనసాగుతారన్నారు. ఇదిలా ఉంటే వివాదం ముదిరిన తర్వాత కూడా తానే టీవీ9 సీఈఓను, లైవ్‌లో మీతో మాట్లాడుతున్నా అని రవిప్రకాష్ టీవీ9 స్క్రీన్ మీద మాట్లాడి 24 గంటల కూడా కాక ముందే ఆయనను ఆ పదవి నుంచి తొలగించేసారు. అయితే రవిప్రకాష్ పై వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు. సంస్థకు సంబంధించి నెగిటివ్ విషయాలను తాము మాట్లాడలేమని, రవిప్రకాష్ ఉదంతాన్ని ఎక్కువగా ప్రస్తావించమని సంస్థ అభ్యున్నతికి పాటుపడతామని వారు చెప్పారు.