సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ … ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
