దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతుబీమా. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోకూడదన్న సంకల్పంతో కొత్తగా పట్టాదారులైన రైతులకు సైతం రైతుబీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందుకొన్న రైతులను రైతుబీమా పథకం కిందకు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పాస్‌బుక్కులు పొందినవారి వివరాలు అందిస్తే అందుకు తగినట్టుగా ఎల్‌ఐసీకి బీమా ప్రీమియం చెల్లించేందుకు వీలుంటున్నందున.. కొత్తగా జారీచేసిన పట్టాదారుల వివరాలు ఇవ్వాలని రెవెన్యూశాఖకు విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి సోమవారం రెవెన్యూశాఖకు ఒక లేఖ రాశారు.