2019 ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్‌సభ స్థానాలకు గాను ఏడు దశల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్నప్పటికీ అన్నీ తానై వన్ మ్యాన్ షో లాగా మోడీ ప్రచార భారాన్ని మోస్తూ కాంగ్రెస్‌పై ధీటైన విమర్శలు చేస్తున్నారు. మేమేం తక్కువ కాదన్నట్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. తమ్ముడికి తోడుగా ప్రియాంకా గాంధీ సైతం ప్రచారం రంగంలోకి దిగడంతో దేశరాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రశాంతంగా సాగిన పోలింగ్ మే 19న ముగిసి మే 23 ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా అన్ని రాష్ట్రాలు కాస్త స్తబ్ధుగానే ఉన్నప్పటికీ ఏపీలో ఒకరకంగా రాజ్యాంగ సంక్షోభమే నెలకొందని చెప్పాలి. దీనికి ఖచ్చితంగా ఈసీదే బాధ్యత అనడంలోనూ ఏలాంటి సందేహం లేదు.ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పదవీ కాలం ఇంకా ముగియలేదు, చంద్రబాబు సర్కారుకు ప్రస్తుతానికైతే శాసనసభలో పూర్తి మెజారిటీ ఉంది. కానీ ఇక్కడ పాలన పూర్తిగా స్తంభించిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యంకు, చంద్రబాబుకు మధ్య వైరుధ్యం ఏర్పడింది. దీనికి తోడు అధికారులకు మంత్రులకు మధ్య యుద్ధం నడుస్తుంది. సీఎస్ మరియు సీఎం ఎవరికివారే ప్రెస్‌మీట్‌లు పెడుతూ ప్రజలను తీవ్ర గంధరగోలానికి గురిచేస్తున్నారు.
సీఎం రివ్యూలను సీఎస్ వ్యతిరేకిస్తుండగా, మంత్రుల ఆజ్ఞలను సచివాలయ అధికారులు పట్టించుకోవడం లేదు దీనికి కూడా పూర్తి బాధ్యత ఎలక్షన్ కమీషన్‌దే అనకతప్పదు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలుండగా
మొదటి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలు,
రెండవ విడత ఏప్రిల్ 18న 13 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ స్థానాలు,
ఏప్రిల్ 23న 14 రాష్ట్రాల్లోని 115 స్థానాలు,
ఏప్రిల్ 29న 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలల్లో ఎన్నికలు నిర్వహించగా..,
మే 6న 7 రాష్ట్రాల్లోని 51 స్థానాలు, మే 12న 7 రాష్ట్రాల్లో 59 స్థానాలు, మే 19న చివరగా 8 రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి,
మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్‌ను తయారు చేసుకున్న జాతీయ ఎన్నికల కమీషన్…
కనీసం అసెంబ్లీ ఎన్నికలున్న రాష్ట్రాల్లోనైనా చివరి విడతలో పోలింగ్ పెడితే బాగుండేది. అలా పెట్టకపోగా ఏపీలో రాజకీయ సంక్షోభంపై ఎన్నికల కమీషన్ కనీసం స్పందించనైనా స్పందించాల్సింది. అదీ కుదరకపోగా అధికార యంత్రాగానికి సైతం పాలనపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలైనా చేయాల్సింది. ఏది ఏమైనా ఒకవేళ చివరి దశలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఇలాంటి సంక్షోభం తలెత్తేది కాదు, ప్రభుత్వ యంత్రాంగం స్తంభించేది కాదు, జనాల్లో ఇంత గంధరగోళం ఉండేది కాదు… సరిగ్గా ఇదే విషయంపై ప్రజల్లోనూ ఎన్నికల కమీషన్‌పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అసలు దేశంలో ఎన్నికల కమీషన్ ఉందా అన్న సందేహం సైతం సగటు పౌరుడిలో తలెత్తుతుది.