ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేది ఎవరనే విషయంలో ఇప్పటికే ప్రజల్లో స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఇప్పటికే పలు సర్వేల్లో తేటతెల్లం అయింది. తాజాగా, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 120-130 సీట్లు వస్తాయని, ఆ యన ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని తలసాని వెల్లడించారు.
“ఏపీ ప్రజలు మోసగాడైన చంద్రబాబును ఇంటికి పంపాలని ఎపుడో నిర్ణయించుకున్నారు. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది ..రాసి పెట్టు కోండి. 22 -23 ఎంపీ సీట్లు వైసీపీ కొస్తాయి. ఓడిపోయాక చంద్రబాబు చేరుకునేది హైదరాబాద్ ఇంటికే“ అని తలసాని వ్యాఖ్యానించారు. ఏపీలో ఓడిపోతాననే భయంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. “చేసింది చెప్పుకోలేక చంద్రబాబు చిల్లరగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబువి అన్నీ దొంగ మాటలే. హైదరాబాద్లో టీడీపీ నేతలకు ఆస్తులుంటే టీఆర్ఎస్ వారిని బెదిరిసున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు బాబు అలా మాట్లాడుతున్నారు.“ అని స్పష్టం చేశారు.
అందరి చరిత్రలు బయట పెడతా అని బాబు అంటున్నారని అయితే, బాబు చరిత్ర తన దగ్గర ఉందని తలసాని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో దొరికి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని తలసాని మండిపడ్డారు. “పసువు-కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులను ఎన్నికల తర్వాత బాబు ఇవ్వరు. ఇది దగా మోసం. కేసీఆర్ను ప్రతి క్షణం తలుచుకోవడమే చంద్రబాబు బతుకు. బాబు ప్రసంగాలతో జనాలకు బోర్ కొడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మాట దేవుడెరుగు…విజయవాడలో కనక దుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టలేకపోయారు“అంటూ ఎద్దేవా చేశారు.