వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆపార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వివేకా తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతివేళ్లకు కూడా గాయాలయ్యాయని, నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని 11గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ఆర్ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వివేకానందరెడ్డి అని గుర్తుచేశారు. అత్యంత సౌమ్యుడు, జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని గ్రామాల నాయకులతో వివేకానందరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.
గతంలో అన్న రాజశేఖరరెడ్డికి తోడుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం కుమారుడికి తోడుగా ప్రయాణం చేస్తున్నారన్నారు. కొన్ని రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి, కుమారుడు మంచిస్థాయికి రాబోతున్నా తరుణంలో వివేకా మరణించడం తీవ్ర బాధను కలిస్తుందన్నారు. శత్రువు కూడా సాయం చేసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైయస్ వివేకానందరెడ్డి అని వైయస్ఆర్ సీపీ నేత కాటసామి రామిరెడ్డి అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వివేకానందరెడ్డి మరణం యావత్తు జిల్లా ప్రజలందరినీ కలచివేస్తుందని, ఈ అనుమానాస్పద మృతిపై లోతైన విచారణ జరపాలని కోరారు.