ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, పెద్దబాబు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మతో వందల సంఖ్యలో ద్వితియశ్రేణి నాయకులు, కార్యక్తలు జగన్‌ను కలసి వైసీపీలో చేరారు.
పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరంతా భారీ సంఖ్యలో రావడంతో జగన్ నివాస పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం మొదలైన పార్టీ చేరికలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తోట నరసింహం సతీమణితో కలసి మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లపాటు టీడీపీకోసం ఎంతో కష్టపడితే చంద్రబాబు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయారు. తాను అనారోగ్యంపాలై ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు భరించలేకే టీడీపీని వీడినట్లు చెప్పారు. జగన్ తమకు ఎక్కడో ఒకచోట టికెట్ ఇస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కాపుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తోట నరసింహం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ మాట్లాడేతూ రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై వైఎస్ జగన్‌కు పూర్తి స్పష్టత ఉందని, ఆయనకు ఈ అంశంపై 25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక ఉందని చెప్పారు.
తాను పేదల ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పును మనం త్వరలోనే చూడబోతున్నామని అన్నారు. తాను పుట్టి పెరిగి, చదువుకున్న విజయవాడ ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నత నగరాలలో ఒకటి ఎదగాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఎవరైతే ప్రజల కోసం నిజంగా కష్టపడతారో వారిని ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారని, తాను వైఎస్సార్‌సీపీలో చేరిక వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీలో చేరినందుకు సంతోషంగా ఉందని నటుడు రాజా రవీంద్ర అన్నారు. తానే పదవులు ఆశించడం లేదని, పార్టీ గెలుపు కోసం ఇటీవలే పార్టీలో చేరిన సీనియర్ నటి జయసుధ, హాస్య నటుడు అలీతో కలసి ప్రచారం చేస్తానని చెప్పారు.