ఇటీవలి కాలంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో నిర్వహించిన సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఆయన నేను ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కోరుకుంటుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారాయన. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేది ఇలాగేనా? వీళ్ల వ్యాఖ్యలను పాకిస్థాన్‌కు రక్షణ కవచంలా వాడుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు మన ప్రతిపక్షాల ప్రకటనలను పాకిస్థాన్ నేతలు వాడుకుంటున్నారని మండిపడ్డారు.
బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులకు ఆధారాలు సంబంధించిన ఆధారాలు చూపాలన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను ప్రధాని మోడీ తప్పుపట్టారు. పేదలు, సంక్షేమం పేరిట రాజకీయ దుకాణాలు నడుపుకొంటూ కుటుంబాన్ని బాగు చేసుకోవడం తప్ప ఇంకేమీ చేయని కొందరు నాయకులకు కాపలాదారుతో సమస్యే నంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.