పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశంలోని ప్రజలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అమరవీరుల కుటుంబాలకు నైతిక మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతుందనడంలో సందేహం లేదు. ఈ దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా హీరోలు విజయ్ దేవరకొండ, తమిళ నటుడు సూర్య విరాళాలు అందించి ముందుకు వచ్చారు.
సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, సామాన్య ప్రజలు కూడా స్పందిస్తున్నారు. ఈ నిధికి సుమారు రూ.15 లక్షల వరకు నేరుగా విరాళం అందించవచ్చు. 15 లక్షల మొత్తం కంటే ఎక్కువ ఇవ్వాలనుకొంటే సైనిక నిధిని ఏర్పాటు చేసే మరో సంస్థకు విరాళం ఇవ్వొచ్చు. భారత్ కే వీర్ అనే కార్పస్ ఫండ్ అకౌంట్‌కు ప్రభుత్వం నియమించే కమిటి బాధ్యత వహిస్తుంది. ఇందులో ప్రముఖులు, స్వచ్చంద సేవకులు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. సైనిక కుటుంబాల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తారు.
ఈ నిధి సైనిక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. హీరో విజయ్ దేవకొండ ఈనిధికి విరాళం అందించి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఇచ్చిన చెక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు. మన సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం. మనం ఇచ్చే విరాళాలతో సైనికుల ప్రాణాలను వెలకట్టలేం. కానీ మన వంతు సహాయాన్ని అందిద్దామని అందరం ఇందులో భాగమై ఓ నైతిక మద్దతును ఇద్దాం అని ట్వీట్ చేశారు. సూర్యకూడా తాను విరాళమిచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు. మరోసారి విజయ్ దేవరకొండను అందరూ బంగారుకొండ అని అభినందిస్తున్నారు.