ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరుతున్నారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్ లు వైసీపీలో చేరిక ముందు నుంచి జగన్ ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే లైన్ క్లియర్ అయ్యింది. గతంలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీ పోరులో కూడా ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విజయసాయిరెడ్డి, దగ్గుబాటిలు ఆమంచితో మంతనాలు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. ఆమంచి టీడీపీని వీడే అవకాశం ఉందన్న వార్తలతో టీడీపీ అలర్ట్ అయ్యింది. ఆమంచిని బుజ్జగించే బాధ్యతను చంద్రబాబుతో పాటు కరణం బలరాం తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. పార్టీ మారకుండా ఉండేందుకు బలరాం ప్రయత్నాలు చేసినా, మంత్రి పదవి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనా ఆమంచి పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఆయనను పార్టీలో ఉంచలేకపోయారు.
మరోవైపు టీడీపీలో తాము ఉండలేం అని ఆమంచి ఆనుచరులు, కార్యకర్తలు అంటున్నారు. వారి అభిప్రాయం, సూచనల మేరకు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమంచి పార్టీ మార్పు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఆమంచి వైసీపీలో చేరనున్నారని దరువు కొద్దినెలలక్రితమే వెల్లడించింది. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. ఎవరెన్ని చెప్పినా దరువు ముందే చెప్పిన అంశం నెరవేరడంతో దరువుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.