జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దుండగల్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా వచ్చిన ఉగ్రవాదులు వాహనంలో కూర్చుని ఉన్న మరో భారత జవాన్‌ను కూడా కాల్చేశారు.
అనంతరం ఇద్దరి మృతదేహాలపై ఏకధాటిగా 11 బుల్లెట్లు దించారని సైనికోద్యోగి తెలిపారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని శనివారం సైనికాధికారులు ఓబులాపురానికి తీసుకొ చ్చారు. వేలాది మంది ప్రజలు వీరజవానుకు నివాళులర్పించారు. కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం.అరుణ కుమారి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మృతుని తండ్రి పెద్ద వెంకట రెడ్డికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్మీ కల్నల్ ఆనంద్‌సింగ్ పర్యవేక్ష ణలో సైనిక లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.