తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్‌లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు.
అయితే ఈ సమీక్ష లో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తడబడ్డారు. పెండింగ్‌లో ఉన్న పనులు ఎందుకు పూర్తికావడం లేదన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కలెక్టర్.. మంత్రి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. కలెక్టర్ ఆమ్రపాలితో పాటు మున్సిపల్ కమిషనర్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడమే. గతంలో వరంగల్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ పట్టణానికి పలు వరాలు ప్రకటించారు. దానికి సంబంధించిన రూ. 300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే నెలలు గడుస్తున్నా వరంగల్‌లో అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడివక్కడే ఉండిపోయాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్.. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పనులు జరగకపోతే అధికారులు బదిలీ అవుతారు కానీ.. ప్రజాప్రతినిధులు వచ్చే సంవత్సరమున్న పరీక్షలు ఎలా ఎదుర్కొంటారంటూ వరంగల్ ప్రజాప్రతినిధులనుద్దేశించి మండిపడ్డారు. ఈనెల 24లోగా పనుల టెండర్లు పూర్తిచేయాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కాగా, సమీక్ష సమావేశం అనంతరం.. మంత్రి కేటీఆర్‌కు తమ తప్పేం లేదంటూ కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా..అసంతృప్తితో వెనుదిరిగినట్టు సమచారం