కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ వచ్చిన సినిమా యాత్ర ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణంచెందిన వైఎస్ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో బాహుబలి ఫేం అశ్రితా వేముగంటి నటించగా, వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు, కేవీపీగా రావు రమేష్‌లతో పాటు సుహాసిని, పోసాని, అనసూయలు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేస్తూ వినూత్న రీతిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్.
ఒక్కోపాటను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే ‘పల్లెల్లో కల ఉంది’ సాంగ్ వైరల్ అవుతుండగా.. ‘మరుగైనావా రాజన్నా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసారు. ఇక సెన్సార్ సభ్యుల నుండి సైతం పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘యాత్ర’ మూవీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కాబోతున్న ఈ సినిమాపై కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. ముదిరాజ్ అనే మలయాళ సినిమాలో హీరో మమ్ముట్టి పక్కన సన్నీలియోన్ ఉన్న ఫొటోలు వైరల్ చేస్తూ యాత్రలో ఐటెం సాంగ్ అంటూ తప్పుడు ప్రచారం చేసారు. అయితే దీనికి వైసీపీ సోషల్ మీడియా కూడా తిప్పటికొట్టింది. ముదిరాజ్ సినిమాలో సన్నివేశాలను తెరపైకి తేవడంతో పాటు ఇటువంటి పోస్టులు చేసేవారిపై చిత్రయూనిట్ చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది.