వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ…ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తే నడుస్తుందా? సోషల్ మీడియాలో శృతి మించిన ఓ నెటిజన్ కం నాయకుడి అరదండాలు పడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీని బిచ్చగాడిగా మార్ఫింగ్ చేసిన ఫొటోపై సీరియస్ అయిన బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ అరదండాలు పడ్డాయి. సోషలో మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే…. మధురైలో ఎయిమ్స్ శంకుస్థాపన కోసం ఆదివారం తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సోషల్ మీడియాలో గో బ్యాక్ మోడీ నినాదాలతో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగిన విషయం తెలిసిందే. మోడీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా MDMK చీఫ్ వైగో ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ మోడీ నినాదాలతో ఉన్న నల్ల బెల్లూన్లని గాల్లోకి వదిలారు. అయితే, మోడీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ MDMK నేత ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన ఓ మార్ఫింగ్ ఫొటో వివాదాస్పదమైంది. చేతికి వాచ్ ధరించి.. మెడలో సంచీలను ధరించి కళ్లద్దాలు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. చిప్పపట్టుకుని ఉన్న ఫొటోను MDMK నేత ఎస్ కేబీ బాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఓ బిచ్చగాడిలా ఉన్న మోడీ చేతిలో చిప్పపట్టుకుని ఇంటింటికి తిరుగుతూ అడుక్కొంటున్నట్లు ఉంది.
ఈ పొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రిపైనే ఇలాంటి వ్యగ్యాస్త్రం, వెటకారాలు ఆడినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేశారు. జైలుకి తరలించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.