తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో కీలక నిర్ణయం వెలువడనుంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగి… ధాన్యం దిగుబడి పెరుగుతుందని… దాని ప్రభావం ధరలపై పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీంతో బియ్యం మార్కెటింగ్‌కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయించారు. బియ్యం మార్కెటింగ్‌పై అధ్యయన బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కి అప్పగించారు. ఆ సంస్థ ఇటీవల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
భవిష్యత్తులో పెరిగే ధాన్యం దిగుబడిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికను, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న పలు మార్గాలను సూచించింది. ధాన్యం సేకరణ, బియ్యం నుంచి వచ్చే ఉప ఉత్పత్తులకు ఉన్న అవకాశాలనూ పరిశీలించాలని తన నివేదికలో పేర్కొనడంతో పాటు ఎగుమతికి ఉన్న అవకాశాలను వివరించింది. తెలంగాణ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. చౌకధరల దుకాణాలను పటిష్ఠపరిచేందుకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిటైల్ చైన్ వ్యాపారసంస్థలతో ఒప్పందాలు చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీజీజీ తన నివేదికలో సూచించింది. సన్న బియ్యం, ఇతర బ్రాండ్ల పేరుతో ఓ వైపు మార్కెట్లో దోపిడీ కొనసాగుతుండగా.. ఇక ఆ దోపిడీకి చెక్ పెట్టేలా ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి ‘తెలంగాణ’ బ్రాండ్ పేరిట దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించే విధంగా ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడి అంచనాలను మించడంతో బియ్యానికి మార్కెట్ కల్పించేదిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.ఏం పండించాం… ఎంత పండిచామన్నది కాదు.. దానికి ఎంత మార్కెట్ కల్పించాం.. రైతులకు లాభం చేకూర్చామన్నదే ముఖ్యం… ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.