సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె(14)ను ఏడాదిన్నర క్రితం ఇంట్లో పనిచేసేందుకు భానుప్రియ చెన్నై తీసుకువెళ్లినట్లు తెలిపింది. నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి.. ఏడాదిన్నర కావొస్తున్న ఒక్క నెల జీతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకు తున్నాని.. అదే క్రమంలో తన కూతురు సంధ్యను కూడ భానుప్రియ వద్ద పనికి పెట్టానని ప్రభావతి చెబుతోంది. అయితే.. భానుప్రియ సోదరుడు తన కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని భానుప్రియ పక్కింటి వారు తనకు ఫోన్ చేసి చెప్పినట్టు వెల్లడించింది. తన కుమార్తెను ఇంటికి పంపాలని భానుప్రియను కోరితే పంపించకుండా, బాలిక దొంగతనం చేసిందని కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. జీతం డబ్బులు ఇవ్వకపోగా, తామే రూ.10 లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయింది. చిల్డ్రన్ హెల్ప్‌లైన్ 1098ను ఆశ్రయించగా వారు తనకు ధైర్యం చెప్పారని, వారి సూచన మేరకు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాలిక తల్లి పద్మావతి తెలిపింది.