టీడీపీ పగలు కాంగ్రెస్తో.. రాత్రి బీజేపీతో చేతులు కలుపుతుందని వైసీపీ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5 శాతం వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఇకనైనా మోసాలు, మాయలు కట్టిపెట్టాలని.. ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఆపాలని హితవు పలికారు. అంతేకాదు రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కాపులు చంద్రబాబు మాటలు నమ్మరని.. అయినా కేంద్రం పరిధిలో ఉన్న విషయాన్ని తాను అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నవరత్నాల్లోని రెండు అంశాలు చంద్రబాబు అమలు చేయడాన్ని వైఎస్ జగన్ తొలి విజయంగా రఘుపతి అభివర్ణించారు.