రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌పై ఈ నెల 18వ తేదీ నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు వెల్లడించారు. విజయవాడ ఎన్జిఓ హోమ్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుందనే భయం జర్నలిస్టుల్లో నెలకొందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు జర్నలిస్టులకు మూడు పడకల ఇళ్ళ నిర్మాణం జరుపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆ హామీకి అనుగుణంగా జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణానికి సబ్సిడీ నిమిత్తం రూ. 200 కోట్లు ప్రకటించి, రూ. 100 కోట్లు నిధులు విడుదల చేయడాన్ని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా డిసెంబర్ 30వ తేదీలోపు ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన జరగక పోవడంతో జర్నలిస్టుల్లో అనుమానాలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కృష్ణాంజనేయులు వెల్లడించారు.
ప్రధానమైన నాలుగు డిమాండ్లపై రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 1. జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణానికి తక్షణమే శంకుస్థాపన చేయాలి. 2. దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు సంబంధించిన స్క్రూటినీ ప్రక్రియను పూర్తి చేసి, మంజూరు పత్రాలను అందజేయాలి. 3. 720, 1200 చ. అ. ఇళ్ళ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారికి సబ్సిడీ పెంపుదల చేయాలి. అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లేకున్నప్పటికీ ఇళ్ళ నిర్మాణానికి అవకాశం కల్పించాలి. సంక్రాంతి పండుగ లోపుగా ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పందించకుంటే 18వ తేదీ నుండి రిలే నిరాహర దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విలేఖర్ల సమావేశంలో ఏపీజేఎఫ్ నాయకులు వీర్ల శ్రీనివాస యాదవ్, యామినేని వెంకట రమణ, టి.అనీల్ కుమార్, నాయుడు వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు