టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తారకరామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. మంత్రిగా ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ఆడియో సీడీని ఆవిష్కరించిన కేటీఆర్.. ఆ తర్వాత చిరుతో కలిసి థియెట్రికల్ ట్రైలర్‌ను సంయుక్తంగా విడుదలచేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్ తన విలువైన సమయాన్ని కేటాయించి ఈ వేడుకకు రావడం సంతోషకరమని, ఆయన రాకతో ఈ వేడుకకు నిండుదనం వచ్చిందని అన్నారు. అసెంబ్లీలో తాను, కేటీఆర్ ఒకే బెంచీపై కూర్చునేవారమని, అప్పట్లో కేటీఆర్ చాలా తక్కువగా మాట్లాడేవారని, వినయ విధేయ రాముడిలా అనిపించేవారని, తనను కుశలప్రశ్నలు వేసి మళ్లీ ఆయన పనిచూసుకునేవారని తెలిపారు. ఏదైనా బాధ్యతను స్వీకరిస్తే దాన్ని నెరవేర్చేవరకు నిద్రపోని కేటీఆర్.. జీహెచ్‌ఎంసీతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విషయాన్ని మరోసారి నిరూపించారని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయభేరి మోగించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. నవతరానికి కేటీఆర్ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు.