యోర్కేర్స్ వేయడంలో మేటిగా గుర్తుంపు పొందిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచి 39 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాడు. ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
అప్పట్లో ఈ రికార్డు మాజీ స్పిన్ బౌలర్ దిలీప్ దోషి పేరు మీద ఉండేది.1979లో టెస్ట్ అరంగేట్రం చేసిన దిలీప్ మొత్తం 40 వికెట్లను తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఆ రికార్డును అధిగమించడం విశేషం. ఇక, బుమ్రా, దిలీప్ తర్వాతి స్థానాల్లో వెంకటేష్ ప్రసాద్ (1996- 37 వికెట్లు), నరేంద్ర హిర్వాణీ (1988- 36 వికెట్లు), శ్రీశాంత్ (2006 – 35 వికెట్లు) ఉన్నారు. ఇక, ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టెస్ట్ కెరీర్ ప్రారంభించిన బుమ్రా ఇప్పటివరకు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను మూడు సార్లు సాధించాడు.ఇదే దూకుడు గా ఆటను ప్రదర్శిస్తే బుమ్రా రికార్డుల పరంపర కొనసాగిస్తాడని క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.