ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు.
మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి మెుదలు పెట్టి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు ఎంత ప్రచారం చేసినా ఏం జరిగిందో ప్రజలు చూశారంటూ విమర్శించారు. ఫిరాయింపులపై తెలంగాణలో నీతులు మాట్లాడిన చంద్రబాబు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఏంటని నిలదీశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, మాటపై నిలకడలేని వ్యక్తి, అనైతిక పొత్తులకు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనంటూ దుమ్మెత్తిపోశారు.
అటు మాజీసీఎం కిరణ్ కుమార్ రెడ్డిపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తెలియదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏం తెలుసు నీకు గోల్కొండ కోటలో గోల్ప్ ఆడుకోవడం తెలుసా అని అడిగారు.జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. రాబోయేది రాజన్న రాజ్యం అని చెప్పుకొచ్చారు.రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.