సిద్ధాంతాలను గాలికి వదిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల పరిరకక్షణ కోసం కొందరు నేతలు ‘మహాకూటమి’గా ఏర్పడుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశవాదుల ప్రయత్నాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని అలాంటి సమన్వయం లేని కూటమిని ప్రజలు ఎప్పుడూ అంగీకరించరని అన్నారు. `కాంగ్రెస్ సారథ్యంలోని ఇది ఓ సిద్ధాంతం ప్రకారం ఏర్పాటవుతున్న కూటమి కాదు. అధికారం కోసమే దాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. ప్రజల కోసం కాదు. కాంగ్రెస్ ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఓ వైపు దేశాభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు“ అని విమర్శించారు.