సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సై అంటే సై అంటున్నారు. తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా వెన్నుపోటు పాట ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు పాట టీజర్‌తో ఏపీ రాజకీయాల్లోని టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించిన రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆర్జీవి దిష్టి బొమ్మలను తగుల బెట్టి నిరసన కూడా తెలిపాయి. తాజాగా రాంగోపాల్ వర్మ టీడీపీ చర్యలకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. “నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు…అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్టుగా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?” అంటూ ట్వీట్ చేసి చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశాడు.
కాగా, సాక్షాత్తు ఎన్టీఆరే చంద్రబాబు తీరును ఎండగట్టిన వీడియోను పోస్ట్ చేసిన ఆర్జీవీ వేసిన ఘాటు ప్రశ్నకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే. తనకు నమ్మకద్రోహం చేసిన తీరును ఎన్టీఆర్ వెల్లడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.