వైఎస్ జగన్ ని 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారినికి దూరంచేసి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఆయన దూరం కాలేదు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని నమ్మిన వ్యక్తి జగన్ కాబట్టే తొమ్మిదేళ్లుగా అధికారం లేకపోయినా ప్రజలను వీడలేదు. నాలుగేళ్లుగా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ప్రజల తరఫున నిలబడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ కలిగినా నేనున్నానంటూ నిలబడ్డాడు. ఆపద సమయాల్లో ఆప్తుడై, ఆత్మబంధువై నిలిచాడు. ఎన్నో ప్రజా పోరాటాలు చేసారు. తండ్రి మరణంతో మనోవ్యధకు లోనై ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను ఓదార్చారు. రాజకీయ కక్షతో అన్యాయంగా జైలు పాలు చేసినా జైల్లోనూ దీక్ష చేపట్టారు. ఏడు రోజులపాటు జైలు గోడలమధ్యే అప్పటి కాంగ్రెస్ నిరంకుశ పాలనను నిరసిస్తూ నిరాహారదీక్షకు పూనుకున్నారు. అన్నదాతలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని గుంటూరులో ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుదీక్ష చేపట్టాడు. రాయలసీమకు జరిగే నష్టం చెబుతూ కర్నూలులో జలదీక్ష చేసాడు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని ఆమరణ దీక్షకు దిగితే ప్రభుత్వం బలవంతంగా దీక్షను భగ్నం చేయించింది. హోదాకోసం శాంతియుత నిరసనను, మౌనదీక్షకు మద్దతును తెలిపేందుకు విశాఖకు వస్తే ప్రభుత్వం దారుణంగా నిర్బంధించింది. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అంటూ జగన్ మాత్రం తన పోరాటాన్ని విడువలేదు. ప్రజల మద్దతుతో ముందుకు నడిపాడు. యువభేరీలతో యువతను చైతన్య వంతులను చేసి, హోదా ఉద్యమంలో భాగస్వాములను చేసాడు. హోదా ఉద్యమానికి భయపడి ప్రభుత్వం మాట మార్చితే వంచనపై గర్జన అంటూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగాడు. కుల ఘర్షణలు జరిగిన చోటకు వెళ్లి శాంతియుత వాతావరణం ఏర్పరిచాడు. ప్రభుత్వ యంత్రాంగం అడుగుపెట్టని చోటకు వెళ్లి ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటాడు. ప్రకృతి విపత్తు వచ్చినా, ప్రభుత్వం భయపెట్టినా నేనున్నానంటూ భరోసా ఇచ్చడు. రాష్ట్రంలోని పేదవాడి కష్టమైనా, అన్నదాత ఆక్రోశమైనా, అక్కచెల్లెమ్మల కన్నీళ్లైనా వారి బాధను తన గొంతులో వినిపించాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇదే ఓ నాయకుడి అంతిమ విజయం. ప్రజాబలం ఉన్న నాయకుడికి ప్రజలకు బలంగా నిలిచే నాయకుడికి ప్రభుత్వాన్నే కాదు ప్రపంచాన్నే జయించే శక్తి ఉంటుంది. అందుకు సాక్ష్యమే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రతిపక్షనేత కాబోయే ముఖ్యమంత్రి యెడుగూరి సందింట వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
