ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కలమట వెంకటరమణ మరదలు, టీడీపీ నాయకురాలు కలమట సుప్రియ తన అనుచరులతో కలిసి పాదయాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. సుప్రియ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు.