భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ యాంగ్రీ బర్డ్‌గా పిలుస్తున్న దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను బుధవారం సాయంత్రం విజయవంతంగా రోదసిలోకి పంపింది. శ్రీహరికోట లోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జీశాట్-7ఏను తీసుకుని జీఎస్ఎల్వీ మార్క్-2 ఎఫ్-11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలోనే.. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూసమస్థితి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వెనువెంటనే శాటిలైట్ కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) విభాగానికి అనుసంధానమైంది. దీంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. మిషన్ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. 2,250 కిలోల బరువున్న జీశాట్-7.. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా పంపిన అత్యంత బరువైన ఉపగ్రహం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. దీని ద్వారా భారత సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది.
ప్రత్యేకించి వైమానికదళానికి ఈ ఉపగ్రహం 8ఏండ్లపాటు సేవలందించనున్నది. ఇప్పటివరకు ఇస్రో 38 సమాచార ఉపగ్రహాలను రోదసిలోకి పంపగా, జీశాట్-7ఏ 39వ కమ్యూనికేషన్ శాటిలైట్. బుధవారంనాటి ప్రయోగం షార్ నుంచి జరిపిన 69వ ప్రయోగం కాగా, ఇందుకోసం 26గంటల ముందుగా శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. నాల్గవతరం అంతరిక్ష వాహక నౌక అయిన జీఎస్ఎల్వీ-ఎఫ్11.. మూడంచెలలో లక్ష్యాన్ని చేరుతుంది. ఇది క్రయోజెనిక్ ఇంజిన్‌ను కలిగిన ఏడవ రాకెట్ కాగా.. జీఎస్ఎల్వీ మార్క్2 శ్రేణిలో ఇది 13వది. ఈ అంతరిక్ష నౌక పొడవు 50మీటర్లు.. అంటే 17అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. బరువు 414 టన్నులు (సుమారు 80పెద్ద ఏనుగుల బరువుతో సమానం). రూ.500కోట్ల నుంచి రూ.800 కోట్ల వ్యయంతో జీశాట్-7ను ఇస్రో రూపొందించింది. గ్రెగోరియన్ యాంటెన్నాతోపాటు మరెన్నో అధునాతన సాంకేతికతలను శాస్త్రవేత్తలు దీనికి జతచేశారు. దీనికి అమర్చిన సౌరఫలకాలు 3.3కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతాయి.
ఉపగ్రహం జీశాట్-7ఏను ప్రధానంగా వైమానికదళ సేవల కోసం తయారు చేశారు. ఇప్పటికే, నేవీ అవసరాలకోసం హిందూ మహాసముద్రంలో 2వేల నాటికల్ మైళ్ల పరిధిలో పర్యవేక్షణకుగాను 2013లో ఇస్రో జీశాట్-7 రుక్మిణి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇక భారత ఆర్మీ కోసం ప్రస్తుతం జీశాట్-6 సేవలందిస్తున్నది. ఈ మూడు ఉపగ్రహాలు భారత రక్షణ వ్యవస్థకు కీలక సమాచార కేంద్రాలుగా పనిచేయనున్నాయి. ఇవికాకుండా కార్టోశాట్, హైపర్ స్పెక్ట్రర్ ఇమేజింగ్ శాటిలైట్లు మన దేశ సరిహద్దులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ఫొటోలను పంపుతున్నాయి. మొత్తం 17మిలిటరీ శాటిలైట్లు భారత్‌కు సేవలందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 320 సైనిక ఉపగ్రహాలుండగా, అందులో సగం అమెరికావే. తర్వాతి స్థానంలో రష్యా, చైనా ఉన్నాయి.