తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుపాన్ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే పలు జిల్లాలో పంట నీట మునిగింది.వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించారు. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భద్రపరచాలని.. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు వీటిని పొందవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉంటున్నవారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.