టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వేలాది మంది జనం జగన్ తో పాటు అడుగులో అడుగు వెయ్యడంతో ఆమదాలవలస ప్రాంతమంతా జనజాతరైంది. భానుని ప్రతాపం పెరుగుతున్న, అలుపెరగని యోధుడిలా జగన్ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజలకు భవిష్యత్ భరోసాను ఇచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. బుధవారం జరిగిన యాత్ర ఉత్సాహంగా సాగింది. అయితే అక్కడ అక్కడ అన్ని పార్టీల నుండి వైసీపీలోకి చేరికలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా (లల్లూ) బుధవారం వైసీపీలో చేరారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని కృష్ణాపురం బస వద్ద ఆయనకు జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
లల్లూతో పాటు ఇచ్ఛాపురం మున్సిపల్ మాజీ చైర్పర్స న్ లాభాల స్వర్ణమణి, కవిటి, ఇచ్చాపురం మండలాలకు చెందిన లల్లూ అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విలేఖరులతో లల్లూ మాట్లాడుతూ.. తాను ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరానని లల్లూ తెలిపారు. పార్టీ ఆదేశం మేరకు తాను పనిచేస్తానన్నారు. అంతకముందు నరేష్ కుమార్ అగర్వాలా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి పోటీ చేసి ఓటమి చెందారు. వైసీపీ పార్టీ పట్ల మెుదటి నుంచి తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని అన్నారు. ఏపీలో అన్ని నియోజకవర్గాలనుండి మాజీ ఎమ్మెల్యేలు , మాజీ ఎంపీలు వైసీపీలోకి చేరిపోవడంతో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ గిలగిల కొట్టుకుంటుందని వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు.