రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే… అమరావతి నిర్మాణం పేరిట రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని నాతో కొంతమంది ఎన్నారైలు అన్నారు. అప్పట్లో వారు అతిగా చెబుతున్నారనుకున్నా.. కానీ ఇప్పుడు చూస్తే లక్ష కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే స్కాం జరిగిందనిపిస్తోంది. ఆర్బీఐకి స్థలం ఎకరానికి రూ.4 కోట్లకి ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతోందో? అన్నారు. ఇంకా మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయకల్లంలు చెబుతున్న నిజాలు వింటుంటే కళ్లు తిరిగాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు. 1996లో వచ్చిన తుపాను సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేశారు. పనిచేస్తే విపత్తు వస్తుందన్న పరిస్థితి అధికారుల్లో ఉంది. ఏం చేస్తే అధికార పార్టీ నేతల్లో మార్పు వస్తుందో ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ప్రాంతంలో జరిగే అవినీతిపైనా స్పందించాలి.’అని పేర్కొన్నారు.