ముందస్తు ఎన్నికల్లో కారు వేగంగా పరుగెడుతున్నది. మరో మారు గులాబీ పార్టీకి ఓటర్లు పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీపైనా ఆధారపడకుండానే టీఆర్ఎస్ స్వతంత్రంగా అధికార పీఠం దక్కించుకోబోతున్నది. పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వం లోని నాలుగు పార్టీల కూటమి ఎన్నికల రేస్‌లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ పార్టీల కూటమిని ప్రజలు ఆహ్వానించ లేదు. ప్రజస్వామ్య పునరుద్ధరణ పేరుతో బరిలోకి దిగిన కూటమిని ప్రజలు విశ్వసించలేదు. ప్రజలు కూటమిని స్వీకరించలేక పోయారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిచ్చారు. శుక్రవారం జరిగిన పోలింగ్ సందర్భంగా 119 నియోజకవర్గాల్లో చేసిన ఫ్లాష్ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయ. ఉత్తర తెలంగాణతో పాటూ దక్షిణ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పాగా వేసినట్టు ఈ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది.
ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి 119 స్థానాల్లో పోటీచేసిన టీఆర్ఎస్ 60 నుంచి 71 స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ 60 స్థానాల్లో విజయం సాధించటం దాదాపు ఖరారు కాగా మరో 10 స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 30 స్థానాలకే పరిమితమయ్యే వాతావరణం నెలకొని ఉన్నది. వీటిలో 23 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతలో ఉండగా ఏడు స్థానాల్లో గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో విజయానికి చేరువగా ఉండగా మరో రెండు స్థానాల్లో ఇతర పార్టీలతో పోరాడుతున్నది. బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నదని స్పష్టమైంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎమ్ఐఎమ్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నది. బీఎస్పీ ఒక స్థానంలోనూ, బీఎల్పీ ఒక స్థానంలోనూ స్పష్టమైన ఆధిక్యత మరో స్థానంలో పోటా పోటీగా ఉన్నది.రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రుల్లో 11 మంది ముందంజలో ఉండగా నలుగురు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
ప్రజా కూటమిలోని నాలుగు పార్టీల్లో టీజేఎస్‌కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం కనిపించటం లేదు. సీపీఐ ఒక స్థానంలో గట్టి పోటీ ఇస్తుండా రెండు సీట్లలో వెనుకబడి ఉన్నది. టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేయగా ఒక స్థానంలో కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకున్నది. మిగిలిన 12 స్థానాల్లో ఏడు స్థానాల్లో వెనుకబడి ఉన్నది. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని పోలింగ్ సరళిని పరిశీలిస్తే అర్ధమవుతున్నది.మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో మళ్ళి టీఆర్ఎస్ నే గెలవడం ఖాయమని తెలుస్తుంది…వరుసగా రెండోసారి సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కడం ఖాయం…ఈ నెల 11తరువాత కారు స్పీడుకు కూటమి కుదేలు అవ్వక తప్పదు