తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ అవసరం ఉంది అని ఆయన తేల్చిచెప్పారు.బడాయి మాటల చంద్రబాబుకు తనకు ఎలాంటి తేడా ఉంటుందో ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. “ఢిల్లీలో చక్రం తిప్పుతా.. తోక తిప్పుతా అని చెప్పడం రాదు. ఢిల్లీని అదుపు చేసేటటువంటి రాజకీయం మాత్రం ఈ ఎన్నికల తర్వాత గ్యారెంటీగా ఉంటది. భారతదేశం కూడా ఇవాళ దిక్కు, దిక్సూచి లేకుండా ఉంది.
కాంగ్రెస్, బీజేపీలు ఘోరంగా విఫలమైనాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని నరేంద్రమోదీకి అధికారమిస్తే.. ఆయన కూడా చతికిలబడి పోయిండు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ఈ రెండు పార్టీలు దేశానికి పనికిరావు. అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకుంటున్నారు. ఈ దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉంది. దీని కోసం తాను కొంత ప్రయత్నం చేశాను. మరింత ప్రయత్నం కొనసాగుతుంది“ అని సీఎం కేసీఆర్ స్పస్టం చేశారు.