తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో మాట్లాడిన కేటీఆర్.. ముందస్తు ఎన్నికలకు సవాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు.. ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ దగుల్బాజీ వ్యవహారాలను ఎండగట్టేందుకు, రాష్ర్టాన్ని ప్రగతిబాటలో ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌కు లీడర్ లేడని, టీడీపీకి క్యాడర్ కూడా లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇరవై ముప్ఫైమంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, వీరంతా తామే సీఎం అంటూ కలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. మహాకూటమిలో సీట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయని, వాళ్లు సీట్లు పంచుకునేలోపే, మనం స్వీట్లు పంచుకుంటామన్నారు. కేసీఆర్ సింహంలా సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తున్నారని, సీల్డ్‌కవర్‌లో ఢిల్లీనుంచి ఎంపికై వచ్చే సీఎం కావాలో.. సింహంలాంటి సీఎం కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.