ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు వేగం పెంచారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే నియోజకవర్గాల్లో నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
భూపాలపల్లి పట్టణంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం, లకా్ష్మపూర్‌లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో కార్యకర్తల సమావేశానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప సమక్షంలో 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కాలినడక నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఆంథోల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి సమక్షంలో తిర్యాని మండలానికి చెందిన 40 మంది గిరిజనులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.