తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళ లోనే అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత అభివృద్ధి సమస్యలు-సవాళ్లు అనే అంశంపై బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. సెస్ చైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వృద్ధిరేటు 7 నుంచి 8 శాతంగా ఉంటే తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు 17 శాతం ఉందని తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అభివృద్ధిలో దేశంలోనే ముందువరసలో నిలిచిందన్నారు.
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకునేందుకు, పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, సంక్షేమ పథకాల అమలుకోసం 2018-19 బడ్జెట్‌లో రూ.45.5 వేలకోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామీణ ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకే సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి లాంటి పథకాలతో ఆడపిల్లలు, మహిళలకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఆసరా పెన్షన్ పథకంతో వృద్ధులకు బాసటగా నిలుస్తున్నదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతలను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతుబంధు పథకాన్ని రూపొందించి బడ్జెట్‌లో రూ.12 వేలకోట్లు కేటాయించామని, దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకంగా నిలిచిన రైతుబంధు ద్వారా దాదాపు 58 లక్షలకుపైగా అన్నదాతలు లబ్ధిపొందుతున్నారని వివరించారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖ వ్యవసాయరంగ నిపుణులతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో రూ.16 వేలకోట్లు కేటాయించామని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలల్లో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
వ్యవసాయరంగంతోపాటు, పారిశ్రామిక రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. సెస్ చైర్మన్ రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఎకానమీ అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సెస్ డైరెక్టర్ ఎస్ గాలబ్, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వైవీ రెడ్డి, జర్మనీ ప్రతినిధి హాన్స్‌బెర్న్ షాఫర్, ప్రొఫెసర్. అమియా కుమార్ బాగ్చీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.