రానున్న రోజుల్లోఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తీర్పుచెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని..ఇందుకుగాను కాంగ్రెస్లో ఓటమి భయం కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు.తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ప్రతిపక్షాలు ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని, దీనికోసం తమకున్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్ భయపడుతున్నదని ఎద్దేవాచేశారు.
శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పిన మంత్రి.. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జనాన్ని దోచుకున్న తోడుదొంగలు ఒక్కటవుతున్నారు.దొంగపనుల్లో కాంగ్రెస్ నాయకులను మించినవారు లేరు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు వస్తే తమ కాళ్లకిందికి నీళ్ళు వస్తాయని ప్రతిపక్షాలకు తెలుసని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతున్నదని విమర్శించారు.దీంతో పాటు అన్ని మంచి కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు తన కుటుంబాన్ని విమర్శించేస్థాయికి కాంగ్రెస్ దిగజారిందని నిప్పులు చెరిగారు.